Tuesday, November 3, 2015

శక్తిస్వరూపం - 1

ఈ సృష్టిలో ఎప్పుడూ జరిగే, ఒక నిర్దిష్టమైన సమాధానం రాని, డిబేట్ -
సైన్సు మరియు దేవుడు.
సైన్సు చాలా వరకూ కనిపించే నిజాల మీద ఆధారపడుతుంది. ఏదైనా ఒక ప్రతిపాదన ఉంటే, దానికి రుజువులు కోరుతుంది. రుజువు చెయ్యని ప్రతీ ప్రతిపాదన సైన్సు దృష్టిలో ఒక నిరర్థకమైన వాదన మాత్రమే!
దేవుడు అనే వాదన ఇక్కడ వెలికి వస్తుంది.
ఒక మహానుభావుడన్నట్టు, ఎక్కడైతే సైన్సు ఆగి పోతుందో, అక్కడ దేవుడు ఉదయిస్తాడు..
God comes into picture where science fails to explain
ప్రస్తుత సమకాలీన సమాజం లో - చదువుకొన్న, చదువుకొని ఒక స్థాయిలో ఉన్న మేధావులు(?), వేసే ప్రశ్న, దేవుడు ఉంటే మరి దానికి ఒక రుజువు ఉండాలి కదా.. ఎప్పుడైనా ఒక సారి, ఎవరికో ఒకరికి కనిపించాలి కదా... మరి, కనిపించనప్పుడు సైన్సు దేవుణ్ణి ఒప్పుకోదు అని...
Science trusts only empirically provable results and results should have repeatability
అంటే - ఉదాహరణకు - ఒక అయస్కాంతం ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము పక్క పక్కన పెడితే ఆకర్షించుకొంటాయి.
ఈ విషయం ఈ సృష్టిలో ఎక్కడైనా రుజువు చెయ్యదగ్గ నిజం. ఎన్ని సార్లు మనం ప్రయత్నించినా అలా ఆకర్షించుకోకుండా చెయ్యలేము. కనక, సైన్సు దాన్ని ఒక రూల్ లాగా చెబుతుంది. విభిన్న ధ్రువాలు ఆకర్షించుకొంటాయి అని.
మరి - దేవుడి విషయం లో ఒక్కొక్క చోట ఒక్కొక్క నిర్వచనం కనబడుతుంది.
మన భగవద్గీత లో వర్ణించిన విశ్వరూపం ఇక సరే సరి..
అనేక బాహువులతో, ముఖములతో, శిరస్సులతో ఆది, మధ్యాంతరహితంగా వర్ణించబడింది..
మరి దీనికి రుజువు ఏమిటి?
ఎవరూ రుజువు చెయ్యలేరు కదా..!
ఎవరికి వారు ఆ అనుభవాన్ని పొందాల్సిందే...
మళ్ళీ ప్రతీ ఒక్కరి అనుభవం ఒక్కోలాగా ఉంటుంది.. !
అంటే దేవుడి గురించిన అనుభవము ఏ ఇద్దరిలో ఒకేలా ఉండదు.
అంటే రిపీటబిలిటీ లేనట్టే కదా...
రిపీటబిలిటీ లేదు కనుక - సైన్సు దేవుడి ఉనికిని ఒప్పుకోదు..
ఈ మధ్య E=mc^2 అనే పుస్తకం చదువుతున్నాను..
దాన్లో చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి చర్చించబడింది....
చాలా చాలా చాలా ఆసక్తికరమైన అంశం.... !
అది చదివాక దేవుడు లేడు అని చేసే వాదనలకు బలమే లేదనిపించింది..
ఎందుకంటే -- ఈ రోజు మనము అనుభవిస్తున్న అత్యాధునిక సైన్సు విప్లవాల మూలము మళ్ళీ దేవుడే అంటే ఆశ్చర్యం కలక్క మానదు.
అది పంచుకోవాలని చేస్తున్న ప్రయత్నమే ఇది..
మనందరమూ చిన్నప్పుడు చదివే ఉంటాము. ఫారడే అనే పేరు వినే ఉంటాము.
ఎలెక్ట్రిక్ చార్జ్ యొక్క ప్రమాణము (unit) ఫారడే.
అంటే ఎలెక్ట్రిక్ చార్జ్ ను మనం ఫారడేల్లో కొలుస్తాము (బరువు KGల్లో కొలిచినట్టు).
ఇది ఫారడే అనే శాస్త్ర వేత్త గౌరవార్థం ఆయన పేరు మీదే ఉంచబడ్డ ప్రమాణం.
వింత ఐన విషయం ఏమంటే - ఫారడే పెద్దగా చదువుకొన్న వాడు కాదు. పదో తరగతి వరకూ చదివాడు. అంతే... !
తర్వాత ఆపేశాడు.
చదవడం ఇష్టం లేక కాదు... చదువుకొనే స్తోమత లేక !
ఒక పుస్తకాల షాప్ లో బైండింగ్ చేసే వాడు... !
ఆ కాలం లో ఆయన Sir Davy Humphry అనే ఒక రాయల్ సొసైటీ శాస్త్రవేత్త ఉపన్యాసాలు బైండ్ చేసేప్పుడు అవి చదివే వాడు.. ఆయన ప్రతిపాదనలకు అనువైన బొమ్మలు గీసే వాడు.. ఒక సారి Davy నుండి ఆయనకు పిలుపొచ్చింది, తన దగ్గర అప్రెంటిస్ గా చేరమని! అది చిన్న విషయం కాదు..
ఎందుకంటే - Davy ప్రతిపాదనలన్నీ సైన్సు బాగా తెలిసిన వాళ్ళే అర్థం చేసుకోదగ్గవి.
ఒక పదో తరగతి డ్రాప్ అవుట్ కుర్రాడికి అర్థమయ్యేవి కావు.
అలాంటిది, తాను చెప్ప దలచుకొన్న విషయాన్ని విడమరచి వ్రాయడమే కాకుండా, అర్థమయ్యేలా బొమ్మలు గియ్యడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ కుర్రాడిలో ఏదో మెరుపు ఉందనిపించింది Davy కి. అందుకే ఆహ్వానించాడు.
ఆ ఆహ్వానం ఫారడే జీవితం లోనే కాదు, మొత్తం సైన్సుకే అప్పటి వరకూ లేని ఒక దిశా నిర్దేశం చేసింది.
కానీ అప్రెంటిస్ గా చేరిన ఫారడే కి పెద్దగా పనేమీ ఉండేది కాదు. పైపెచ్చూ, Davy యొక్క షార్ట్ టెంపర్ కు బలి కావాల్సి వచ్చేది...
సైన్సు అప్పటికి ఇంకా - ఇప్పుడు తెల్సిన స్థాయిలో అభివృద్ది కాలేదు... వాళ్ళకు తెల్సిన విషయం ఇప్పటితో పోలిస్తే చాలా తక్కువ... ఐతే - ఆ తక్కువ విషయాలు కూడా ఫారడే కి తెలియవు...
ఒక సారి Davy తన ప్రయోగశాలలో ఒక వింత కనుక్కొన్నాడు...
ఒక వైరు గుండా విద్యుత్తు పంపినప్పుడు - పక్కనే ఉన్న దిక్సూచి(Compass) దిశ మారింది.
విద్యుత్తు ఆపేస్తే - మళ్ళీ యధా స్థానానికి వచ్చింది..
లోపల ప్రవహిస్తున్న విద్యుత్తు బయట ఎక్కడో ఉన్న కంపాస్ ను ఎలా కదల్చగలిగింది?
(ఇంకా ఉంది)

No comments: