Thursday, November 5, 2015

శక్తిస్వరూపం - 2

అంత దాకా విద్యుత్తు అంటే ఎక్కడో ఒక తీగలో ప్రవహించే శక్తి!
ఎక్కడో తీగలో ఉన్న ఒక శక్తి మంత్రం వేసినట్టు బయటకు దూకి తన మానాన తను పడి ఉన్న కంపాస్ ను కదల్చడమేంటి?
అసలు కంపాస్ నీడిల్ ను కదిలించడానికి అయస్కాంత శక్తి కావాలి.
కొంప తీసి దగ్గర్లో అయస్కాంతాలేవైనా ఉన్నాయా?
ఇలాంటి ఆలోచనలతో Davy సతమతమై పోయాడు!
కానీ ఆయనకు అక్కడ జరిగిన విషయం బోధపడలేదు..
సరే... ఈ ప్రయోగం లో ఉన్న మర్మం ఏమిటి అనేది కనుక్కొనే బాధ్యత ఆయన ఫారడే కు అప్పగించాడు.
ఒక కుర్రాడు..
అందులో పెద్దగా చదువు లేని కుర్రాడు...
తాను వ్రాసిన ఉపన్యాసాల ఙానం తప్ప సైన్సు అంటే పెద్ద అవగాహన లేని వాడు... ఈ రహస్యాన్ని ఎలా ఛేదించగలడు అనే ఆలోచన బహుశా Davy కి రాలేదేమో...
చరిత్రను మలుపు తిప్పడానికి కారణభూతమైన చర్యలు అంతగా ప్రాముఖ్యం లేనట్టుగానే కనిపిస్తాయి. ఒక సారి మలుపు తిరిగాక, ఆ చిన్న పని ఎంత మహత్తరమైందో అర్థమౌతుంది.
మయ సభలో కాలు జారడం అనే చిన్న కారణం, మహా భారత యుధ్ధానికి దారి తీయలేదూ?
ఈ బాధ్యత ఫారడే కు అప్పగించడమూ అంతే...!
ఈ బాధ్యత ఫారడే కు అప్పగించడానికి ఒక నాలుగేళ్ళ క్రితం నుండి, ఫారడే ఒక అమ్మాయితో కోర్ట్ షిప్ లో ఉన్నాడు .
కోర్ట్ షిప్ అంటే ఇప్పటి మన టర్మినాలజీ ప్రకారం డేటింగ్ లాంటిది. కాకపోతే... రూల్స్ కొంచం కఠినంగా ఉంటాయి.
అంటే - ఇద్దరూ ఎప్పుడూ నలుగురు తెలిసిన వారి సమక్షం లోనే కలవాలి, ఒకరి నొకరు తాక రాదు లాంటివన్న మాట..
ఒక మూడేళ్ళ కోర్ట్ షిప్ తరవాత, ఒక సారి ఫారడే ఆ అమ్మాయికి ఒక లేఖ వ్రాశాడు.
"... ఓ అమ్మాయీ! నా గురించి నాకు తెలిసినంతగానో, లేక అంతకన్నా కాస్తా ఎక్కువగానో నీకు నా గురించి తెలుసు.
నీకు నా గతకాలపు ఈర్ష్యాద్వేషాలు తెల్సు.
వర్తమానపు ఆలోచనలు తెల్సు.
నా బలహీనతలు తెల్సు,
నా అహంకారం తెల్సు,
నా మనసు నీకు తెలుసు..
నా గురించి ఇంత తెలుసుకున్న అమ్మాయికన్నా ఉత్తమ జీవన సహచరి నాకు దొరుకుతుందా? ఓ యువతీ నన్ను వివాహమాడడం నీకు సమ్మతమేనా?"
మరి ఇది ప్రేమ లేఖో - ఆత్మ నిందా పత్రమో తెలీదు కానీ, ఆ అమ్మాయి ఫారడేని చాలా ఇష్టపడింది...
నా అహంకారం నీకు తెలుసు అనే మాట వాడిన వాడు తన గురించి తాను ఎంత తాత్విక పరిశీలన చేసుకొన్న వాడో అర్థమౌతోంది కదా...
1821 లొ వారికి వివాహం జరిగింది...
ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే... స్టీవ్ జాబ్స్ చెప్పినట్టు, ఒక సంఘటన కు సంబంధించిన మూలం ఎప్పుడూ గతం తో ముడిపడి ఉంటుంది. ఒక సంఘటన జరుగుతున్నప్పుడు ఆ సంఘటన ప్రభావం మనకు తెలియక పోవచ్చు, కానీ జీవితం లో ఏదో ఒక స్థాయికి వచ్చాక (విజయమైనా, పరాజయమైనా), గతాన్ని మననం చేసుకొంటే - ప్రస్తుతానికి దారి తీసిన పరిస్థితులు అర్థం అవుతాయి.. జీవితం లో జరిగే ప్రతీ విషయానికి మరో విషయం తో లంకె ఉంటుంది..ఆ లంకె మనకు చాలా కాలానికి గానీ అర్థమవదు.
అలాంటిదే - ఫారడే వివాహం...
ఆ వివాహం వల్ల ఫారడే "శాండిమానియన్స్" అనే ఒక క్రైస్తవ శాఖలో శాశ్వత సభ్యుడయ్యాడు..
ఈ శాండిమానియన్స్, బైబిల్ లో వున్న కొన్ని పధ్ధతులను జీవితం లో ఆచరిస్తారు.
(హిందువుల్లో శైవులు, వైష్ణవులు లాగా, ఈ శాండిమానియన్స్ అనేది ఒక శాఖ.. ఈ శాఖ గురించి నాకు పెద్దగా వివరాలు తెలీవు కానీ, వీరు ప్రధానంగా భక్తి, వేదంత సాహిత్యపు విలువల నుండి స్ఫూర్తి పొందుతారు. తాము నేర్చుకొన్నది పది మందికీ చెబుతారు).
వీరి ప్రకారం (అంటే బైబిల్ ప్రకారం) -
ఈ సృష్టిలో ఉన్న మనుష్యులంతా అసంపూర్ణులే. ఏ మనిషీ పరిపూర్ణుడు కాడు.
భగవంతుడు మనిషిని సృష్టించేప్పుడు, ప్రతీ మనిషిలో ఏదో ఒక ప్రత్యేక ప్రఙను
ఉంచి సృష్టించాడు. వాటితో పాటే కొన్ని బలహీనతలూ పెట్టి సృష్టించాడు..
అందుకే ఒక మనిషి మరో మనిషికి చేయూతనివ్వాలి, ఆ మరో మనిషి ఇంకో మనిషికి ఆసరా ఇవ్వాలి... ఇలా ప్రతీ మనిషీ చేస్తూ పోతే - మనకు కూడా ఎదో ఒక మనిషి నుండి చేయూత అందుతుంది.. అంటే వలయం (Circle) పూర్తయ్యింది. దీన్నే ఆ శాఖ "జీవన వలయం"(Circle of Life) గా అభివర్ణించింది.
ఈ సిధ్ధాంతాన్ని మనఃస్ఫూర్తిగా నమ్మాడు ఫారడే. నమ్మడమే కాదు నిజ జీవితం లో అలాగే ఆచరించాడు.
ఈ జీవన వలయం అనే చక్రం. మనుషులతో నిర్మితమైంది.
అందరు మనుషులూ కలిస్తే ఒక పరిపూర్ణ మానవత్వం దృగ్గోచరమౌతుంది.. !
ఈ భావన ఫారడేలో చూపిన ప్రభావమే Davy ప్రయోగంలో కంపాస్ నీడిల్ ను కదిలించగల అనూహ్య శక్తి ఆవిష్కరణకు ప్రధాన సోపానమైంది.
(ఇంకా ఉంది)

No comments: