Wednesday, November 18, 2015

శక్తిస్వరూపం - 3

Part - 3
ఫారడే ఇలా తన ప్రయత్నంలో తలమునకలుగా ఉన్న కాలం లో,
విజ్ఙాన శాస్త్రం లో న్యూటన్ నియమాల హవా నడుస్తుండేది..
సర్ ఐసాక్ న్యూటన్..!
17వ శతాబ్ధం లో వెలుగు చూసిన పేరు
సైన్సు మూలాలనే ఒక ఊపు ఊపిన పేరు..!
న్యూటన్ కనుక్కొన్న నియమాలలో ప్రధానమైనవి -
చలన సూత్రాలు (Newton's laws of motion),
గురుత్వాకర్షణ సిధ్ధాంతం (Newton's Gravitational Law).
మనలో చాలా మందికి చలన సూత్రాల గురించి తెల్సు.. !
ఇక్కడ అమెరికా లో ఐదో తరగతిలోనే లీలా మాత్రంగా ఈ చలన నియమాలను పిల్లలకు పరిచయం చేస్తారు..
కానీ - నా ఉద్దేశ్యం లో ఆయన ప్రతిపాదించిన గురుత్వాకర్షణ సిధ్ధాంతం చాలా విశిష్టమైంది.. !
ఆ సిధ్ధాంతం ప్రకారం - ఈ విశ్వం లో ప్రతీ వస్తువూ, మరో వస్తువును ఒక విధమైన బలంతో (Force) ఆకర్షిస్తుంది...
ఆ బలం ఆ రెండు వస్తువుల ద్రవ్యరాశులను బట్టీ, వాటి మధ్య ఉన్న దూరాన్ని బట్టీ మారుతుంది. ఉదాహరణకు
మనం భూమిని ఆకర్షిస్తాం,
అలాగే భూమీ మనలను ఆకర్షిస్తుంది.
మనం భూమి ఆకర్షించలేనంత దూరం వెళితే తప్ప, భూమి ఆకర్షణ నుండి తప్పించుకోలేము.
మన వల్ల భూమి మీద ఉండే ఆకర్షణ కంటే,
భూమి మనలను ఆకర్షించే శక్తి చాలా ఎక్కువ,
అందుకే, మనం ఎప్పుడూ భూమిని అంటుకొనే ఉంటాం.
అదే మనం చంద్రుడి మీద ఉన్నామనుకోండి, అక్కడ ఆకర్షణ భూమి ఆకర్షణలో ఆరో వంతు ఉంటుంది,
అంటే - చంద్రుడి ఆకర్షణ నుండి తప్పించుకోవడం చాలా సులభం..
ఈ విధంగానే ఈ మహా విశ్వం లో ప్రతీ వస్తువు, మరో వస్తువును ఆకర్షిస్తూనే ఉంటుంది...
ఆ రెండు వస్తువుల మధ్య దూరం తగ్గి పోయిందనుకోండి. ఆకర్షణ విపరీతమై, ఆ రెంటిలో చిన్న వస్తువు, పెద్ద వస్తువు మీద పడి పోతుంది...
దూరం పెరిగిందనుకోండి, దేని దారిన అది వెళ్ళి పోతుంది(Out of sight, out of mind అనేది విశ్వం లో ఉన్న వస్తువుల విషయం లో కూడా నిజమే! )
ఇదే గురుత్వాకర్షణ సిధ్ధాంతం... !
( ఆ తర్వాత, ఈ సిధ్ధాంతం అనేది ఈ విశ్వం లో జరుగుతున్న ఒక జగన్నాటకం లో చిన్న భాగమనీ.... గురుత్వాకర్షణ అనే విషయమే ఒక భ్రమ లాంటిది అనీ తర్వాత కనుక్కోబడింది.. వీలైతే ఆ కథ మరో ఎపిసోడ్ లో చూద్దాం..)
ఇదంతా ఎందుకు చెప్పానంటే... ఆ కాలం లో న్యూటన్ ప్రభావం సైన్సు లో విపరీతంగా ఉండేదని చెప్పడానికి... !
ఆ కాలాన్ని సైన్సులో "న్యూటన్ యుగం" (Newtonian Era) అని పిలుస్తారు.
ఫారడే తన ప్రయోగాలు చేస్తున్న కాలానికి, సైన్సులో చాలా విషయాలు తెలుసు - విద్యుత్ శక్తి తెల్సు,
అయస్కాంత శక్తి తెలుసు,
గురుత్వాకర్షణ శక్తి తెలుసు...
కాక పోతే -
ఈ శక్తులను లెక్క కట్టడానికి శాస్త్రజ్ఞులు సరళ రేఖామానాన్ని వాడేవారు.
సరళ రేఖా మానం అంటే - న్యూటన్ మహాశయుడి ప్రకారం...
ఏ బలమైనా సరళ రేఖలో పని చేస్తుంది..
ఉదాహరణకు,
ఒక పండు నేల మీద పడిందనుకోండి -- ఆ పండు నేరుగా భూమి మీదకే పడుతుంది. అంతే గానీ
చెట్టు నుండి విడివడ్డ పండు
కాసేపు గాలిలో గింగిరాలు తిరిగి,
కాసేపు పైకి ఎగిరి,
కాసెపు అడ్డంగా ప్రయాణించీ...
తీరిగ్గా నేల మీద పడదు.
చెట్టు నుండి విడి వడ్డ మరుక్షణం,
నేరు గా సరళ రేఖలో ప్రయాణిస్తూ నేల మీద పడుతుంది.
అందుకే - భూమికి, పండు కి మధ్య ఆకర్షణ శక్తి లెక్క కట్టడానికి ఆ రెంటికీ మధ్య ఉన్న దూరాన్ని సరళ రేఖ గీసి కొలిచి - దాని ప్రకారం లెక్క కడతారు ( దూరాన్ని బట్టి ఆకర్షణ శక్తి మారుతుందని ఇందాక చెప్పుకొన్నాం..)
అలాగే - ఒక అయస్కాంతం...ఇనుప ముక్క ను ఎంత బలంతో ఆకర్షిస్తుంది అని చెప్పడానికి వాటి మధ్య గీత గీసి దాని ప్రకారం లెక్కలు కడతారు.
ఒక వేళ ఏదైనా వంకర టింకర మార్గాల్లో లెక్కలు కట్టవలసి వస్తే - ఆ వంకర టింకర మార్గాన్ని అనేక సరళ రేఖలుగా విభజించి లెక్కలు కడతారు. ఇది సరళ రేఖామానము...
ఆ కాలం లో స్కూల్ లో చేరితే - నేర్పే విషయాలన్నీ పైన చెప్పిన విధం గానే ఉండేవి.
Davy నిర్వహించిన ప్రయోగం లో కంపాస్ నీడిల్ ఎందుకు కదిలిందో చెప్పలేక పోవడానికి కారణం, ఆయన ప్రయోగం లో పాల్గొని పరిశీలిస్తున్న వారంతా ఇదే విధానాన్ని అవలంబించారు..
ఎందుకంటే వాళ్ళు సైన్సు నేర్చుకొన్నది అలాగే...
ఫారడే ఒక్కడే వాళ్ళల్లో చదువు లేని వాడు.. !
అందుకే ఆయనకు ఇలా లెక్కలు కట్టాలన్న విషయమే తెలీదు. ఇంగ్లీష్ లో అంటుంటారు Out of box thinking అని. అది ఫారడే కి వీలు పడింది... ఆయన చదువు లేని తనమే ఆయనను భిన్నం గా ఆలోచించేలా చేసింది...
ఆయనకు ఒక విషయమైతే స్పష్టమైంది...
ఒక వైరులో విద్యుత్ వెళుతున్నప్పుడు,
అంత వరకూ లేని శక్తి ఏదో కొత్తది వెలువడుతోంది...
అది దాదాపు అయస్కాంత శక్తిని పోలి ఉంది...
ఆ గదిలో ఒక్క అయస్కాంతం గానీ, ఒక ఇనుప ముక్క కానీ లేకుండా ముందే తను ఖాయం చేసుకొన్నాడు ( తన ప్రయోగం లో ఉపయోగించే వైర్లు తప్ప, మరేదీ లేకుండా...)
దిక్సూచి ని ఒక స్టూల్ మీద పెట్టాడు!
నిశ్చలంగా భూమి ఉత్తర దిశను సూచిస్తూ ఉంది నీడిల్.
వైర్లోకి విద్యుత్ ప్రవహింపజేసి, వైరు దగ్గరగా దిక్సూచిని జరిపాడు.
నీడిల్ మెల్లగా కదిలింది...
వైరు కు బాగ దగ్గరగా కదిలించాడు..
చాల బలమైన అయస్కాంత ప్రభావానికి లోనైనట్టు నీడిల్ కదలాడింది... !!
విద్యుత్తు ఆపాడు...
నీడిల్ మళ్ళీ యధా స్థానానికి వచ్చి భూమి ఉత్తర దిశను సూచిస్తూ నిలబడింది...
ఒక్క విషయం మాత్రం ఖాయం...
వైరులో విద్యుత్తు వెళుతున్నప్పుడు అయస్కాంత శక్తి లాంటిది వస్తోంది...!!
ఎలా వస్తోంది?
ఎక్కడ నుండి వస్తోంది?
తను విన్న - చదివిన ఉపన్యాసాల పరిఙానం మొత్తం కేంద్రీకరించి ఆలోచించాడు...
వైరు చుట్టూ వస్తూన్న శక్తి ఏమిటి?
కాసేపు అయస్కాంత శక్తే అనుకొందామనుకొన్నాడు.
ఆది ఏ ఆకారం లో ఉందో ఊహించే ప్రయత్నం చేశాడు.
మనసులో ఒక ఆకారం వచ్చింది...
సరళ రేఖలో కాదు --- ఒక టోర్నడో ఆకారం ఊహించాడు...
ఆ టోర్నడో టిప్ వైరు కు అంటుకొని ఉంటుందని అనుకొన్నాడు ...
ఇదంతా కేవలం తన ఆలోచన మాత్రమే.. ఇంకా రుజువు కాలేదు.. !
నాలుగైదు పరీక్షల తర్వాత - ఫారడే ఊహిస్తున్న అయస్కాంత క్షేత్ర ఆకారం అలాగే ఉండే అవకాశం ఉందని ఆయనకు స్పష్టం గా బోధ పడింది..
ఇక అది అయస్కాంత శక్తా కాదా అన్నదే తెలియాలి.
ఇంతలో ఫారడే బావ మరిది, జార్జ్ బెర్నార్డ్, ఫారడే గదిలోకి వచ్చి పలకరించాడు...!
ఆయన కూడా శాండిమానియన్స్ లో సభ్యుడే... !
ఫారడే ఏమీ మాట్లాడలేదు...
ఒకటే ఆలోచన...
అన్నీ బాగానే ఉన్నాయి !
ఎలాంటి అయస్కాంతాలు లేని ప్రదేశం లోకి, వైరు లోకి విద్యుత్తు ప్రవహించగానే అయస్కాంత శక్తి ఎక్కడ నుండి వస్తోంది....ఏం మాయ జరుగుతోంది?
చరా చర జగత్తును సృష్టించిన నిరాకారుడు అదృశ్యం గా సృష్టిస్తున్న మాయా జాలమా?
అకస్మాత్తుగా ఏదో అర్థమయ్యింది...
అవునా.. నిజమేనా...?
గబ గబా... ఏవో లెక్కలు చేశాడు..
వెంట వెంటనే ఏవో ప్రయోగాలు చేశాడు....
ఆ ప్రయోగాల ఫలితాలు చూడగాణే స్థాణువై నిలబడి పోయాడు....
గొప్ప గొప్ప ఆనందాలు ఇచ్చే కారణాలన్నీ మొదట మనిషిని స్థాణువునే చేస్తాయి మరి...!
(ఇంకా ఉంది) 

No comments: