Friday, May 28, 2010

పర్ణశాల బ్లాగ్ పై ఒక సమీక్షా వ్యాసం

పోకిరి సినిమా లో చివర్లో మహేష్ బాబు, ఆశీష్ విద్యార్థి నుద్దేశించి ఇలా అంటాడు.

"ముల్లు ను ముల్లుతోనే తీయాలి.. కానీ ఆ ముల్లును తీయడం లో ఈ ముల్లు సహాయం చేసింది కదా అని ఇది మంచి ముల్లు అయిపోదు! ఇది కూడా ముల్లే..! "

యథాతధంగా ఇదే కాక పోయినా ఇంచుమించు ఇదే అర్థం తో డైలాగ్ ఉంటుంది. ఎందుకిదంతా చెపుతున్నాను అంటే..

దాదాపు గా ఒక సంవత్సరం అటూ ఇటూ గా ఈ సదరు పర్ణశాలను నేను చదువుతున్నాను. మొదట్లో బ్లాగు రచయిత వ్రాసే కొన్ని వ్యాసాలు బాగా నచ్చి చదవడం కొనసాగించాను. కానీ ఈ సంవత్సర కాలం గా నేను ఆ బ్లాగు లో చదివిన హిందూత్వ వ్యతిరేక భావజాలం, హిందూ ధర్మం లో మాట్లాడవలసి వస్తే "బ్రాహ్మిణికల్ ఆటిట్యూడ్" అంటూ ప్రత్యేకించి ఒక కులానికి సంబంధించిన వారి మనసులు జివ్వు మనేలా వ్రాసే వ్రాతలూ, దానికి సమర్థింపులూ, వాదోపవాదాలూ చదివాక నాకు అనిపించిన భావాలను నా బ్లాగు ముఖంగా మీతో పంచుకోవాలనిపించి నేను చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది.. నా వాదన మీ భావాల పట్లే కానీ వ్యక్తిగతంగా మీ గురించి కాదని నేను మరో సారి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అనుకోంటాను

అయ్యా.. మీరు బ్లాగ్ వ్రాయడానికి మతం, కులం, దేవుళ్ళూ తప్ప మరో వ్రాయదగ్గ విషయం దొరకదా? వేరేవి కూడా వ్రాసాను అంటారా.. కానీ "అశ్వథ్థామా హతః కుంజరః" అన్నట్లు, కొన్ని వ్రాసి ఉండొచ్చు గాక! కానీ సింహ భాగం - "దళితుల ఉద్యమం", "గొడ్డు మాంసం", "నగ్న దేవతలు" వీటి తోనే నిండి పోతాయేంటి? ( మీరు చెప్పిన కొన్ని దళిత బ్లాగులు చూసాను .. "2050 కల్లా బ్రాహ్మణుల సంఖ్య బాగా తగ్గి పోతుంది.." లాంటి మహత్తర విషయాలపై వ్రాసిన ఆ వ్రాతలు విషం చిమ్మటం కాక మరేమిటి?

మీకు ఒక విషయం చెప్పనా.. మీరు దళిత బ్లాగుల లిస్ట్ ఇచ్చాక, అది చదివి, అందులో కామెంట్స్ చూసాక నాకు ఈ వ్యాసం వ్రాయాలనిపించింది..ముందు ఉదాహరణ లాంటి విషయం ఒకటి చెపుతాను..

"ఇస్లాం తీవ్రవాద శిబిరాల్లో" అక్కడి యువకులకు వాళ్ళు చెప్పే విషయాలు ఇస్లాం మతం గొప్పదనాన్ని వర్ణించేవి గా ఉండవట.. తమ మతాన్ని ఇతర దేశాలు, ఇతర మతాలు ఎలా అణగదొక్కుతున్నాయి అని కథలు కథలు గా చెప్పి, వారిలో ఆవేశాన్ని రెచ్చగొట్టేలా చేస్తారుట! ఆ మత్తులోబడి, మరి యే ఇతర మతస్థుడూ మనిషే కాదన్న మూఢత్వంతో ఆ సదరు యువకులు ఎన్ని అఘాయిత్యాలు చేస్తారో ప్రపంచం మొత్తానికి తెల్సిందే.. ఇందులో తప్పెవరిదంటారు..? ఊళ్ళు తగలేసే ఆ యువకులదా? కసబ్ ను ఉరి తీయాలి అని భారత దేశం లో ప్రతీ ఒకరు ఆవేశం తో ఊగిపోయారు.. ఆ మానవ మృగం చేసిన ఘోరం అలాంటిది మరి.. కానీ వాడు కూడా బేసిక్ గా మనిషే కదా.. సాటి మనిషిని కర్కశంగా , పాశవికం గా ఉసురు తీసే ఆ మృగత్వం ఎక్కడ నుండి వచ్చిందంటారు? వాడికి అలా శిక్షణ ఇచ్చిన వాళ్ళే కదా అందుకు కారణం..? మరి వాళ్ళకు ఎన్ని మరణ శిక్షలు విధించాలి?

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. మీ బ్లాగు లో మీరు వ్రాసే భావజాలం కూడా అలాగే ఉంటుంది మరి.. మీరు "హిందూత్వ తీవ్రవాదులు" అంటూ వ్రాసే వ్రాతలు.. ఖచ్చితంగా బాధించేవే ఔతాయి మరి! ఎవరి జోలికీ వెళ్ళకుండా, ఎవరినీ బాధించకుండా తమ పని తాము చేసుకు పోయే హిందువులను, రక రకాల పేర్లతో తీవ్రవాదం తో మట్టుపెట్టడం మొదలెడితే.. దాన్ని ప్రతిఘటించడం తీవ్రవాదమా.. లేక ఆత్మ రక్షణా..? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆ ఇస్లాం తీవ్రవాదం గురించి ఆచి తూచి కామెంట్ చేసే మీరు, హిందువులు అనగానే ఎందుకు విరుచుకు పడతారు? మీరు ఇలాంటి వ్రాతలు వ్రాసి, దాన్నెవరైనా ఖండిస్తే..ఆ ఖండనను "ఆభిజాత్యపు పొరల్లోంచి వచ్చిన మాటలు" గా ఎలా ఖండిస్తారు? మీ వ్రాతలను సహేతుకంగా ప్రశ్నిస్తే అది ఆభిజాత్యమా? లేక సమాధానం చెప్పలేక మీరు చేసే ఎదురు దాడా?

ఎప్పుడో చరిత్ర మొదట్లో హిందూ ధర్మం కాస్తా హిందూ మతం గా పరిణమించి ఉండొచ్చు గాక, అప్పట్లో అగ్ర వర్ణాలు నానా యాగీ చేసుండొచ్చు గాక, గొడ్డు మాంసం తినడం నిషేధించి ఉండొచ్చు గాక..కానీ ఇప్పుడు ప్రపంచమే ఒక కుగ్రామం గా మారి పోయిన ఈ నవతరం లో, కులాలు, మతాల మధ్య వైరుధ్యాలు చెరగి పోతున్న ఈ ఆధునిక జీవనం లో, ఒక హిందువూ, ఒక క్రైస్తవుడూ, ఒక మహమ్మదీయుడూ కలసి మెలసి సంఘటితం గా విజయాలు సాధిస్తూన్న ఈ కాలం లో.. మీరు ఇలాంటి చచ్చు పుచ్చు వ్రాతలు వ్రాసి సాధించాలనుకొన్నది ఏమిటి? అలా వ్రాయడం , ఆరుతున్న మంటలను ఎగదోయడం కాదా? ఎలాంటి ఆలోచనలు లేని వాడికి కూడా.. "ఔరా .. ఒకప్పుడు ఈ అగ్రవర్ణాలు మమ్మల్ని అణగ దొక్కాయి.. వీళ్ళు మనకు శత్రువులు" అని అన్యాపదేశం గా మీరు చేస్తున్న ఉపదేశం కాదా? అనవసరం గా కులపిచ్చిని, మత పిచ్చిని ప్రోత్సహించడం కాదా? ఎప్పుడో ఎవరో కొట్టుకు చస్తే, దాన్ని ఇప్పుడు భూతద్దం లో చూపి - ఆ గొడవలను తర తరాలు గా కొనసాగించేలా చూడడమా మీ వ్యాసాల ఉద్దేశ్యం? మాట్లాదితే "సాధికారతా స్వరాలు" అంటారు... మనిషి కి మనిషి కి మధ్య లేని/అంతరిస్తున్న భేదాలను సృష్టించే ఆ స్వరాలు మీకు "సాధికారతా స్వరాలు" గా వినిపించొచ్చేమో కానీ.. మానవత్వం మంటగలిపే వైషమ్యాలను సృష్టించే గావుకేకలు గా మాత్రమే చాలా మందికి అనిపిస్తాయి మరి.. మీ వ్రాతల ద్వారా మీరు సాధిస్తున్నది ఏమిటి? ఈ ప్రశ్నకు మీరు ఎవరికీ జవాబు చెప్పనక్కరలేదు.. మీకు మీరే సమాధానం ఇచ్చుకోండి. "నా ఆత్మ సంతృప్తి కై నే వ్రాసుకొంటా" అంటే, మరి మీ ఆత్మ సంతృప్తి మరొకరి మనో వేదనకు కారణం కాకూడదు కదా.. లేదు ...నా పద్దతే అంతా అంటారా.. ఇక చెప్పేదేముంటుంది? మీ పద్దతి అదే ఐతే దాన్ని ఇంగ్లీష్ లో "సాడిజం" అంటారు. పది మంది బాధ వల్ల కలిగే సంతృప్తి "సాడిజమే" కదా!

అయ్యా.. మీరు వ్రాస్తున్న ఈ వ్రాతల వల్ల - జనాల్లో అసహనం పెరుగుతోంది.. ఇస్లామిక్ తీవ్రవాద శిబిరాల్లో చేసే బోధనల్లా ఉంటున్నాయ్ మీ వ్రాతలు! మతం అనేది ఒక నమ్మకం, ఒక సున్నితమైన మానసికమైన విషయం. మనందరినీ రక్షించే వాడు ఒకడున్నాడు అని అనుకొంటే మనిషి కష్టాల్లోకొండంత బలం తో ముందుకు వెళ్ళగలుగుతాడు. ఆ రక్షించే వాడిని ఒక్కో మతం వాళ్ళు ఒక్కొ రకంగా పిల్చుకొంటారు.. కొందరు రాముడంటారు, కొందరు క్రీస్తంటారు. క్రీస్తును నమ్మే వాడి కారణాలు వాడికుండొచ్చు.. కానీ రాముణ్ణి పూజించే వాడిని కించపరిచే హక్కు వాడికి లేదు గాక లేదు..! ఈ చిన్న తర్కాన్ని విస్మరించి.. పూర్వం హిందూ దేవతలు బట్టలు వేసుకోవడం నేను చూళ్ళేదు.. రాముడి గొప్పేంటి లాంటి అజీర్తి వ్రాతలు యే సమ సమాజం కొరకంటారు? వాల్ పోస్టర్ల మీడ అశ్లీల దృశ్యాలుంటేనే మహిళా సంఘాలు గోల చేస్తుంటాయి.. అలాంటిది.. మనం పవిత్రం గా పూజించే దేవతలు బట్టలు వేసుకోరు అంటు పిచ్చి వ్రాతలు వ్రాస్తే.. ఆ వ్రాతలు ఆ దేవతలను పూజించే వారి మనసులను ముక్కలు చెయ్యవా? అలా బాధ పడ్డారంటే వాళ్ళకు అసలు హిందూ ధర్మమే తెలీదు, క్రీ.పూ. రామనుజా చార్యుల ప్రకారం.. ఫలానా సమయంలో ఫలానా దేవతలకు బట్టల్లేవనే విషయమే నీకు తెలీదు, నువ్వు బాధ పడ్డానికి కూడా అనర్హుడివి అని మీరు చేసే హుంకరింపులు ఎంత దాకా సమంజసం ?

నేను భక్తి గా ఒక దేవతను కొలుచుకొంటాను.. నాకు హిందూ మతం ఎప్పుడు పుట్టిందో, ఎవరు ఎవరిని అణగ దొక్కారో అనవసరం, తెల్సుకోవాల్సిన అవసరం లేనే లేదు.తెల్సుకొని సాధించేదీ ఏమీ లేదు ! మతం.. మతం అంటూ కొట్టుకు చచ్చిన ఆ పూర్వకాలపు మూర్ఖత్వం నేను తృణీకరిస్తాను. కానీ ఈ ప్రపంచం అంతటినీ రక్షించే ఒక మహోజ్వలమైన శక్తి ఒకటి ఉంది అని మాత్రం మనః పూర్తిగా విశ్వసిస్తాను. ఆ శక్తి కే నేను దేవుడు అని పేరు బెట్టుకొన్నను.. ఆ శక్తి కి ఒక రూపం ఇచ్చాను.. ఆ రూపాన్ని రాముడన్నాను.. ఆ రాముడి భార్య సీత అన్నాను. ఇప్పుడు చెప్పండి - "నగ్న దేవతల" గురించి మీ సమర్థన ఎందుకు ఒప్పుకోవాలి? నేను దైవం గా కొలిచే వారికి ఒక పవిత్రత నేను ఇచ్చుకొన్నాను.. ఎప్పుడొ రాజ రాజ చోళుడు ఇచ్చాడా లేదా అనేది నాకు అనవసరం.. అలా అని ఇరవై నాలుగు గంటలు "రామా..రామా" అంటు కూచోను.. "రామా ... రామా" అని ఎవరైన అనక పోతే వాడి పీక తెగ నరకను ... నా బాధ్యత నేను నిర్వర్తిస్తూ, పక్క వాడిని గౌరవిస్తూ,చేతనైనంత వరకూ నా పరిధిలో ఇతరులకు(వాడు హిందువా, క్రైస్తవుడా, దళితుడా అని చూడకుండా) సహాయ పడుతూ ఉండే నేను.., నా కష్టం లో సుఖం లో నేను ఆరాధనగా నా ఇష్ట దైవాన్ని కొలుచుకొంటుంటే,నా దైవానికి "నైతికత ఉందా.. సీతను వదిలేసాడా..రావణుడు ఎందుకు గొప్పవాడు కాదు" అని ఎవరైనా అంటే.. నాకు కోపం వస్తే అది నా ఆభిజాత్యం ఎలా ఔతుంది? అలాంటప్పుడే మీ లాంటి వారి వ్రాతలు చిరాకు తెప్పిస్తాయి. ఏమిటీ మనిషి? కులం, మతం అంటూ విద్వేషాలు విరజిమ్ముతున్నాడు. ఇతగాడికి వేరే పనీ పాటా ఏమీ లేదా అని..నేను పూజించే దేవతలను కించ పరిచే హక్కు ఇతగాడికెవరు ఇచ్చారు..నా నమ్మకాన్ని ఎద్దేవా చేసే హక్కు ఇతడికెక్కడిది? అని!

అయ్యా మీరు జనాన్ని ఉధ్ధరించాలి అనే అనుకొంటే.. వెళ్ళండి ....జనం లోకి వెళ్ళండి..

పతితులు, భ్రష్టులూ, బాధా సర్పద్రష్టులూ అనేకమండి ఏడుస్తున్నారు.. అన్నమో రామచంద్రా అని విలపిస్తున్నారు. మీ జగన్నాధ రధ చక్రాలు వారి వైపు నడిపించండి.. వారికి మీ చేతనైన సహాయం చెయ్యండి, అణగ దొక్క బడ్డ వాళ్ళకు చేయూత అందించండి.. అది వదిలేసి, హిందూ ధర్మం గురించి విమర్శనా వ్యాసాలు వ్రాసి మీరు సాధించే విప్లవం ఏంటొ నాకైతే అర్థం కావడం లేదు. అనవసరమైన కుల చిచ్చునూ మత చిచ్చునూ రెచ్చగొట్టడం తప్ప ! హిందూ మతం లో సారం లేదనో, అసలు మతమే కాదనో, లేక వాళ్ళ దేవతలు బట్టలు వేసుకోలేదనో మీరు నిరూపించి ఒరగబెట్టేది మాత్రం ఏమీ లేదు.. సున్నితమైనా ఈ భావలను కెలకడం వల్లే, ఈ మత చిచ్చు, కుల చిచ్చు ఆరకుండా రగులుతూనే ఉంది..

ఏ మతానికి సంబంధించిందని, ఏ దేశానికి సంబంధించిందని , మదర్ తెరీసా ను ప్రపంచ ప్రజానీకం దేవత గా అభివర్ణిస్తారు..? అలాంటి సమాజోపయోగ కార్యక్రమాలు చెయ్యండి.. లేదు అంత శక్తి నాకు లేదు .. నేను నా భావజాలం తో మాయా జాలం సృష్టిస్తా అంటారా.. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, ఎందరో మనసులకు తూట్లు పొడిచే మీ చెత్త వ్రాతలను పక్కనబెట్టి, మీకు భారత రాజ్యాంగం బాగా తెల్సు అన్న విషయం మాకు అర్థమయింది.. ఆ రాజ్యాంగం సామాన్యుడికెలా ఉపయోగ పడుతుంది. ఎవరికి ఏ హక్కు ఉంది లాంటి విషయాలు వ్రాస్తే కనీసం ఒకరికైనా అది ఉపయోగ పడుతుంది.. లేదు.. నేను ఇలానే వ్రాస్తాను అంటే.. అప్పుడూ హిందూ తీవ్రవాదం పెరుగుతోందని వ్యాసాలు వ్రాయడం మానుకోండి. ఎందుకంటారా.. మరి మీలాంటి వారే కదా దానికి కారణం.. మీరే కదా అనవసర విద్వేష సృష్టి కర్తలు! మానవీయత నుదుటన ఆరని నెత్తుటి మరకలు! భేషజం ఆభిజాత్యం అని అందర్నీ అనడం కాదు. మీరు మీ ఆత్మ న్యూనతా పొరల్లోంచి, సినిసిజపు కోరల్లోంచి బయటపడి ఆలోచించండి.. లోపం ఎక్కడుందో అర్థమౌతుంది.. !

మీరు ఒకప్పటి కుల-మత ఆభిజాత్యపు ముల్లును, మీ భావజలపు ముల్లుతో తీస్తున్నాను అనుకొంటున్నారు. కానీ మీరు వాడేదీ ముల్లే అని, ఆ ముల్లు కూడా మీకు ఎటువంటి మనశ్శాంతినీ ఇవ్వదని గ్రహించిన రోజు.. మీకు సత్యం బోధపడుతుంది..మీరు శోధించీ సాధించిన జ్ఞానానికి సార్థకత చేకూరుతుంది.

Monday, April 19, 2010

A song from Morning Raga

This is the song from Morning Raga, originally sung by Sudha Raghunathan in the movie

Click Here to see the video