Tuesday, November 24, 2015

శక్తిస్వరూపం - 4

ఆ క్షణం లో ఫారడే కనుక్కొన్న విషయం, సైన్సు రంగాన్నే ఒక కుదుపు కుదిపింది..
అప్పటి దాకా అయస్కాంత శక్తి ఎక్కడినుండో సృష్టించబడుతోందనుకొన్నాడు, ఫారడే!
అది నిజం కాదు... శక్తి, రూపం మారుతోంది..!
అంటే - ఆ తీగలో ప్రవహిస్తున్న విద్యుత్ శక్తే, తనలో కొంత భాగాన్ని రూపం మార్చి, అయస్కాంత శక్తి గా మారుస్తోంది.
అంటే - శక్తి యొక్క రూపం మారుతోంది.
శాండిమానియన్స్ ఎలాగైతే - ఏ మనిషీ సంపూర్ణుడు కాడని నమ్ముతారో - ఒక సంపూర్ణ మానవ తత్వం కనబడాలంటే సృష్టిలోని మనుషులంతా ఎలా ఏకం కావాలో - అలాగే
ఏ ఒక్క శక్తి సంపూర్ణం కాదు...
అన్ని శక్తులూ అంటే
విద్యుత్ శక్తి, ధ్వని శక్తి, కాంతి శక్తి, ఉష్ణ శక్తి, అయస్కాంత శక్తి - ఇలా రక రకాల శక్తులు సృష్టిలో ఉన్నాయి.. కానీ ఏ ఒక్క శక్తి సంపూర్ణం కాదు. ప్రతీ శక్తి మరో విధమైన శక్తి తో ఏదో ఒక విధమైన సంబంధం కలిగి ఉంది... అంటే - సంపూర్ణం గా శక్తి ఎంతో తెలియాలంటే - ఈ మహా విశ్వం లో ఉన్న అన్ని శక్తులనూ కలిపి చూస్తే కానీ పరిపూర్ణ శక్తి రూపం గోచరమవ్వదు... మరో విషయం ఏమంటే -- ఒక రకమైన శక్తి ఎక్కడైనా నష్టమైతె, తక్షణమే ఆ శక్తి మరో రకమైన శక్తి రూపాన్ని సంతరించుకొంటుంది కానీ, శక్తి శాశ్వతంగా మాయమవ్వదు
అంటే - సృష్టిలో ఉన్న ఎలాంటి శక్తినీ మనము సృష్టించలేమూ, అలాగే నాశనమూ చెయ్యలేము...
మనం ఎక్కడైతే శక్తిని సృష్టిస్తున్నామని భ్రమ పడుతున్నామో అక్కడ నిజానికి ఎలాంటి సృష్టీ జరగట్లేదు, ఒక రకమైన శక్తి మరో రూపాన్ని సంతరించుకొంటోంది.
అలాగే - ఎక్కడైతే శక్తి నష్టమైందనుకొంటున్నామో, అక్కడ కూడా శక్తి మరో రూపానికి మారుతోంది... ఒక రకమైన శక్తి మాయమై, మరో రకమైన శక్తి పుడుతోంది.
అంటే ఈ సృష్టిని సృష్టించిన నిరాకార బ్రహ్మ తత్వం
ఈ విశ్వమంతటి లోనూ కొంత శక్తిని నిక్షిప్తం చేసింది.
అప్పటి నుండీ, ఇప్పటి దాకా, అలా సృష్టించబడ్డ శక్తి లో మిలియనో వంతు కూడా నష్టమవలేదు. దానికి ఎటువంటి కొత్త శక్తీ చేరలేదు.
తారల పుట్టుకలోనూ, అంతాల్లోనూ (Super Nova అంటారు, తార అంతాన్ని - చాలా ఆసక్తికరమైన టాపిక్), తారల మనుగడలోను, గ్రహాల భ్రమణాల్లోనూ, ప్రాణ శక్తి లోనూ, వాయు శక్తి లోనూ, విద్యుత్ లోనూ, కాంతి లోనూ, ధ్వనిలోనూ, ఉష్ణములోనూ ఎక్కడ చూసినా ఈ శక్తే ఉంది. అంటే వీటన్నిటినీ కలిపితే - మొదట ఎంత శక్తి సృష్టించబడ్డదో అంతే శక్తి వస్తుంది.. ఎలాగైతే - ఒక్క మనిషే పరిపూర్ణ మానవ తత్వాన్ని చూపలేడో, అలాగే ఏ ఒక్క శక్తీ పరి పూర్ణ శక్తి ని సూచించదు.
శక్తి ని సృష్టించలేము, నాశనము చెయ్యలేము ( Energy can neither be created, nor be destroyed). కానీ ఒక రకమైన శక్తిని మరో రకమైన శక్తిగామార్చవచ్చు. కానీ ఏ క్షణం లో చూసినా, ఈ విశ్వం లో ఉన్న మొత్తం శక్తి లో ఎలాంటి మార్పూ ఉండదు.
దీన్నే Law of Conservation of Energy అని పిలుస్తారు...
ఒక్క సారి గమనిస్తే - ఫారడేకు ఈ ఆలోచన రావడానికి ప్రధాన కారణము ఆయన తాను నమ్మిన మతం లో చెప్ప బడ్డ ఒక మంచి విషయం కదా.. ఏ మనిషీ పరిపూర్ణుడు కాడు అనే మాటే కదా.. ఆ మాట ఎవరు చెప్పారు?
బైబిలు చెప్పింది..
బైబిలు ఎవరు చెప్పారు?
దేవుడు చెప్పాడు.. అంటే - ఫారడే ఈ విషయం కనుక్కోవడం వెనక చాలా లోతైన మతపరమైన, దైవ సంబంధమైన విశ్లేషణ ఉంది అని స్పష్టం గా తెలుస్తోంది కదా..!
మతం పేరుతో తన్నుకు చావడం కాదు. ఏ మతం లో అయినా సరే చెప్పిన మంచి విషయాన్ని సరైన కోణం లో ఆలోచిస్తే - మొత్తం ప్రపంచానికే ఉపయోగపడే విషయాలకు శ్రీకారం చుట్టవచ్చని తెలియడం లేదూ ఈ వృత్తాతం వింటే...?
ఇంత గొప్ప విషయం కనుక్కొన్న ఫారడే ఒక అప్రెంటిస్ నుండి - రాయల్ సొసైటీ లో సభ్యుడిగా ఆహ్వానించబడ్డాడు. ఎన్నో పురస్కారాలు, దేశాధినేతలతో సత్కారాలూ అందుకొన్నాడు..
విఙానరంగం ఆయనకు హారతి పట్టింది...
ఆ తర్వాత - ఫారడే సైన్సు రంగం లో అనేక పరిశోధనలు చేశాడు. అనేక విషయాలు కనుక్కొన్నాడు.
ఒక రకంగా విద్యుదయస్కాంత వర్ణ పటానికి (Electro Magnetic Spectrum) ఫారడే పితామహుడిలాంటి వాడు.
ఆయన పరిశోధనలు మరో ఇరవై యేళ్ళ తర్వాత పుట్టిన అలెగ్జాండర్ గ్రాహం బెల్ అనే శాస్త్ర వేత్త టెలిఫోన్ కనుక్కోవడానికి కారణమైంది.
తర్వాత, ఎనభై యెళ్ళకు పుట్టిన అయిన్ స్టయిన్ మహాశయుడి సాపేక్ష సిధ్ధాంతానికి మూలమయింది (Theory of Relativity)
( అయిన్ స్టయిన్ - ఈ Law of Conservation of Energy ని సంపూర్ణం గా విశ్వసించలేదు... ఆయన ఊహ ప్రకారం - ఈ విశ్వాన్ని సృష్టించిన భగవంతుడు, కొంత శక్తిని ఈ విశ్వం లో పెట్టి - అదే శక్తి రక రకాల రూపాలు సంతరించుకొనేలా చేశాడు.. చేసి అంతటితో ఆగలేదు - మరి కొంత శక్తిని ఎవరూ గుర్తించలేని విధంగా, ఊహామాత్రం గా కూడా అనుమానం రాని చోట దాన్ని దాచాడు.... ఎవరూ కనుక్కోలేరనుకొన్నాడు... ఈ సృష్టిలో అయిన్ స్టయిన్ మహాశయుడు జన్మించక పోయి ఉంటే - బహుశ దాన్ని కనుక్కోవడం జరిగేది కాదేమో అన్నా అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పటి శాస్త్ర వేత్తలంతా - అయిన్ స్టయిన్ కనుక్కొన్న సిధ్ధాంతానికి కొనసాగింపే చూస్తున్నారు కానీ, ఆయనలా విభిన్నంగా ఆలోచించడం లేదు.)
ఇదంతా నాణేనికి ఒక వైపు... మరో వైపు ఏమంటే...
ఫారడే తన కళ్ళ ముందే ఇలా ఎదగడం Davy Humphry భరించలేక పోయాడు...
తన దగ్గర అప్రెంటిస్ గా చేరిన ఒక యువకుడు, తన సమాన స్థాయిలోకి రావడం ఆయన అసలు జీర్ణించుకోలేక పోయాడు. Davy కూడా దాదాపు ఫారడే లాంటి జీవన విధానం తోనే మొదలయ్యాడు... ఆయనేమీ చిన్న వాడు కాదు. Alkaline metals and Alkaline Earth Metals లాంటివి కనుక్కోవడం లోనూ, క్లోరిన్ లాంటి మూలకాల అణుతత్వాన్ని విశ్లేషించి వివరించడం లోనూ ఆయన చూపిన ప్రతిభా అమోఘమైంది.. ఒక దశలో ఈ ప్రపంచానికి ఫారడే ని బహుమతి గా అందించింది తానే అని చెప్పుకొన్నాడు.. అంతటి వాడు - చివరి రోజుల్లో తాను ఏ విషయం లోనూ మిగతా శాస్త్ర వేత్తలకు పోటీ ఇవ్వలేక పోయాడు. కొత్త నీరు రాక, పాత నీటిని తోసేస్తుంది కదా..దానికి ఆయనేమీ బాధ పడలేదు! రాయల్ సొసైటీ అధ్యక్షుడిగా, ప్రపంచం లో ఎవరైనా Davy తో మాట్లాడితే చాలు అనే స్థాయిలో ఉన్నాడు కనక, అంత కన్నా ఎక్కువ కోరడానికి కూడా ఏమీ లేదు కనక - సంతోషంగానే ఉన్నాడు. చివరి రోజుల్లో పరిశోధనలు పూర్తిగా మానేశాడు... అలాంటి సమయం లో ఫారడే ఎదుగుదల అతడిని బాధించింది...
ఫారడే మీద తీవ్రమైన ఆరోపణలు చేశాడు... ప్లేగేరిజం(అంటే తన ఆలోచనలు తనకు చెప్పకుండా వాడుకోవడం.. ఒక్క మాటలో చెప్పాలంటే విఙాన చౌర్యం!) అంటగట్టాడు.
ఫారడే కనుక్కొన్న విషయాలన్నీ తాను, తన మరో స్నేహితుడితో చర్చిస్తుండగా ఫారడే విని - అవి కాపీ కొట్టి - తానేదో గొప్ప విషయం కనుక్కొన్నట్టుగా పోజులు కొడుతున్నాడనీ, అసలు ఫారడే కనుక్కొన్న విషయాలన్నీ తన ఆలోచనలేనని బహిరంగంగా చాటాడు.
ఫారడే చాలా అర్థించాడు. తన మీద ఇటువంటి అపవాదు వెయ్యవద్దనీ - తాను నమ్మిన దైవం తనకు చూపిన దారి వల్ల, తన ఆలోచనల వల్లే తాను ఆ విషయాలు కనుక్కొన్నానని ఎంత గానో చెప్పుకొన్నాడు.. వేడుకొన్నాడు...తన జీవిత కాల పరిశొధనను అడ్డుకోవద్దని కాళ్ళా వేళ్ళా పడ్డాడు. Davy కరగ లేదు...
ఫారడే - మౌనం గా బయటకు వచ్చేశాడు..అవడానికి రాయల్ సొసైటీ సభ్యుడైనా - తర్వాత ఎటువంటి పరిశోధనలూ చెయ్యలేదు... అలాగని Davy మీద ఎటువంటి ఆరోపణలూ చెయ్యలేదు, ఎదిరించనూ లేదు..చాలా రోజులు ఈ ఆరోపణలు కొనసాగించాడు Davy. ఐతే ఫారడే నుండి ఎలాంటి తిరుగుబాటూ రాలేదు. దాంతో కొన్ని రోజులకు Davy కూడా చల్లబడ్డాడు. ఐతే తన ఆరోపణలు అబద్దాలని ఆయన ఎప్పుడు చెప్ప లేదు... కాక పోతే జనమే Davy ని పట్టించుకొనడం మానేశారు.
ఇద్దరు వ్యక్తులు - ఒకే స్థాయిలో ప్రారంభమై - ఆకాశం అంచులు తాకాక - అలా తాకానన్న గర్వం తలకెక్కి ఒకరు పాతాళానికి పడిపోతే, అదే ఎత్తులో అంత కన్నా ఉన్నతం గా తన వ్యక్తిత్వం ద్వారా మరొకరు ఎదిగారు.. విజయం కొందరికి అహంకారం ఇస్తే, మరి కొందరిని వినమ్రులను చేస్తుంది....
Davy మరణం వరకూ మళ్ళీ ఫారడే ఎలాంటి పరిశోధనలూ చెయ్యలేదు.. అసలు పరిశోధనలన్న ఆలోచనే మరచి పోయాడు.
Davy మరణం తరవాత, ఫారడే - మళ్ళీ తన ప్రస్థానం ప్రారంభించారు... ఎన్నెన్నో పరిశోధనలు చేశాడు.. ఆయన పేరుతో ఒక ప్రమాణమే ( Unit) ఉందంటే - మనం ఊహించుకోవచ్చు వైఙానిక రంగానికి ఆయన అందించిన సేవలు ఎంత విప్లవాత్మకమైనవో....
ఏది ఏమైనా -
ఈ మొత్తం కథలో -
law of conservation of Energy అనే ఒక భావనకు మూలం దేవుడు!
సైన్సు ఐనా, దేవుడైనా, మతమైనా - మనిషికి బోధించేది మంచినే - అది తీసుకోవడం మానేసి - ఆ మతాన్నే ఒక ఐడెంటిటీ చేసుకొని నిత్యమూ తన్నుకు చావడం మూర్ఖులు చేసే పని.. మతం అనేది మనిషి నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఫారడే క్రైస్తవుడు కాబట్టి - బైబిల్ లొ చెప్పింది మనసా వాచా పాటించాడు కనుక - క్రైస్తవం గొప్పది, మిగతావి అధమం అవవు. ఏ మతం చెప్పినా మంచే బోధించింది.. సమస్య మతం లో లేదు - స్వీకరించే మనిషి లో ఉంది... ఫారడే జీవిత గాధ చదివాక నాకు అనిపించిన విషయం ఇదే..
ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం ఇది చెప్పడమే...! ఇక్కడితో ఈ వ్యాసం అయ్యింది..
ఈ వ్యాసాలను వ్రాయడానికి నన్ను ప్రోత్సహించిన పెద్దలందరికీ, పేరు పేరునా కృతాఙతాంజలులు
అయిపోయింది.

No comments: