Monday, August 12, 2013

ఇంటిదీపమై వెలిగే ఇంధనాలు ఇంతులూ - కొంప కొఱివిగా మారే కారణాలు కాంతలు - 3


కథ ఎందుకు చెప్పానంటే, ఇక్కడ రెండు విభిన్న భావాలు చెప్పబడి ఉన్నాయి.
1) పెళ్ళైన కొత్త నుండీ భర్త అధికారం చెలాయించకుంటే, అతడు జీవితాంతం భార్యా దాసుడిగా ఉండక తప్పదు, అలా కుదరదు అనుకొంటే విడాకులు తీసుకోకా తప్పదు

2) భార్య ను అధికారం తో లొంగదీసుకోవడం తప్పు, ఏది సాధించాలన్నా ప్రేమతోనే సాధించాలి.

మనలో చాలా  మందికి రెండోదే న్యాయం అనిపిస్తుంది. నా వరకూ కూడా రెండో మాటకే నా ఓటు. మరి మా మిత్రుడు అన్నివిధాలుగా అలాగే ఉన్నాడే, మరి అతడు విడాకులు తీసుకోవడం ఏమిటి? అధికారం చెలాయించాలనుకొన్నవాడు ఆనందం గా కాపురం చేసుకోవడం ఏమిటి?
చాలా పెద్ద ప్రశ్న ఇది!

మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం.. ముఖ్యంగా ప్రేమ కథా చిత్రాల్లో!

హీరో గోడలూ మేడలూ దూకి, హీరోయిన్ని రక్షించి, తర్వాత హీరోయిన్ తల్లిదండ్రులతో పోట్లాడి అమ్మాయిని పెళ్ళడుతాడు.. ! చూసిన ప్రేక్షకులు కూడా తృప్తిగా బయటకు వస్తారు.. మరో టైపు సినిమాలూ ఉన్నాయి - హీరో, హీరోయిన్లు చివరి దాకా పోరాడి, ఎవరినీ ఒప్పించలేక ఆత్మహత్య చేసుకొని అమర ప్రేమికులౌతారు..

ఇక్కడ కూడా - అంటే బ్లాగుల్లో కూడా - ఎన్నో కవితలు, ఎన్నెన్నో  వర్ణన లతో ఉన్న కవితలు చూస్తుంటా.. భావుకత నిండిన కవితలూ,  ప్రపంచంలో ఉన్న అభిమానాన్నంతా కురిపించే కవితలూ, .. అబ్బో ఆకాశమే హద్దు ! తప్పు లేదు.. భావుకత ఉండాల్సిందే. ఆమాత్రం భావోద్వేగాలు లేక పోతే జీవించడం ఎందుకు?

కానీ గమనించాల్సింది ఏమంటే, మనం ఏదైతే కథకు ముగింపు అనుకొంటున్నామో అదే, కథకు అసలైన ఆరంభం! పెళ్ళాడాక, ఒకే కప్పు కింద ఇద్దరు కలసి నివసిస్తున్నప్పుడు వచ్చే పొరపొచ్చాలు సినిమాల్లో చూపరు (ఒక వేళ చూపినా, అది కుటుంబ కథా చిత్రమనీ, టీ.వీ. సీరియల్లా ఉందని పెదవి విరిచేస్తారు). ఒకే చూరు కింద నివాసమున్నప్పుడు, చాలా విషయాలు తేడా వస్తాయి... ! ఎవరు ఎక్కువ, ఎవరి మాట నెగ్గాలి లాంటి సమస్యలు వస్తాయి... భర్త తన పంతం నెగ్గించుకోవాలంటే - అతడి మీద పురుషాధిక్య ముద్ర వేస్తారు, కేసులేస్తారు, నాన్-బెయిలబుల్ వారెంట్లు తెచ్చి అరెస్ట్ చేయిస్తారు.. చూసే వాళ్ళకు అసలు ఇతగాడినేనా అమ్మాయి అందరినీ ఎదిరించి పెళ్ళాడింది అని అనిపించేలా పరిస్థితులొస్తాయి... న్యాయం అమ్మాయి వైపు ఉంటే, అబ్బాయికి శిక్ష పడాల్సిందే.. తప్పు లేదు.. కానీ న్యాయాన్యాయలకతీతంగా ముందైతే పురుషుడు జెయిలు కెళ్ళవలసిందే..

ఒకప్పుడు కాబోయే శ్రీమతి తో గంటలు గంటలు మాట్లాడినా చాలని ప్రేమికుడు, తర్వాత ఊసు ఎత్తడానికి కూడా ఇష్టపడడు. ఒకప్పుడు ఎవరి గురించైతే కన్న వాళ్ళను, ఉన్న ఊరునూ, చేస్తున్న పనినీ కూడా వదిలేసి రావడానికి సిధ్ధపడ్డ అమ్మాయి, తరవాత్తరవాత  ప్రపంచంలో ప్రధమ శత్రువు గా భర్తను ఎందుకు చూస్తుంది?

ఎందుకిలా జరుగుతుంది?

అసలు నేను మొదలెట్టిన విషయానికి, ఇక్కడ చెప్తున్న విషయానికీ సంబంధం ఏంటా  అనుకొంటున్నారా? వస్తున్నా.. అక్కడకే వస్తున్నా.. !

నా వివరణ కొంత దాకా పురుషులను సమర్థించేలా ఉంటుంది... ఎందుకంటే.. స్త్రీ సమస్యలు, స్త్రీ సాధక బాధకాలు లాంటి విషయాల గురించి ఇప్పటికే వేల మంది లక్షలకొద్దీ వ్యాసాలు వ్రాసేశారు. మరి మగవాడికి కూడా వాదన ఉంటుందిగా అది చెప్పాలనే నా ప్రయత్నం..

స్త్రీ అయినా పురుషుడైనా బేసికల్ గా మనిషే...!
పురుషుడిలో ఉండే రాగద్వేషాలు స్త్రీలలో కూడా ఉంటాయి... ఇంకా చెప్పాలంటే కొంచం హెచ్చు స్థాయిలో ఉంటాయి. ఎక్కడైనా గమనించండి.. ఇద్దరు పురుషులు ఒకరినొకరు క్షమించుకొన్నంత తేలిగ్గా ఇద్దరు స్త్రీలు క్షమించుకోరు.. ఇద్దరి మధ్య తేడా వచ్చిందంటే, ఇక బంధం తెగిపోవాల్సిందే.. కాకపోతే... పురుషుల్లా, స్త్రీలు బయట పడరు. కానీ మనసులో మాత్రం తీవ్ర నిరాశా, నిస్పృహలకు లోనవుతూ, అవతలి వారి మీద ద్వేషాన్ని పెంచుకొంటూ ఉండేది స్త్రీలే.. పైకి మాత్రం చిరునవ్వు చెక్కు చెదరదు..

కనుక చెప్పొచ్చేదేమంటే... ఇద్దరికీ భావావేశాలు సమానంగా ఉంటాయి.. ఆలోచనా స్థాయిలు మాత్రం విభిన్నం గా ఉంటాయి.. తేడా వచ్చేది ఇక్కడే..

ఒక పురుషుడు తనకు కాబోయే భార్యను ఒక నవలా నాయికగా, తన బాధ్యత సమానం గా పంచుకొనే ఒక స్నేహితురాలిగా భావిస్తాడు.. ఆమె అందాన్ని చంద్రుడితో పోలుస్తాడు! ఆమె సౌకుమార్యాన్ని కలువ పూలతో జతపరుస్తాడు, ఆమె ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉంటాయని భావిస్తాడు. కాకపోతే ఇవన్నీ సినిమా నాయికలకు, నవలా నాయికలకు మాత్రమే ఉండే లక్షణాలు..

అదేంటీ, అమ్మాయిలు తమకు కాబోయే భర్తల గురించి అలా ఆలోచించరా? అని మీరడగవచ్చు. ఎందుకు ఆలోచించరు?

ఆలోచిస్తారు !

కానీ అలా ఆలోచించి, నిజ జీవితంలో సర్వం కోల్పోయిన అమ్మాయికి ఉండే కనీస సానుభూతి కూడా, అదే స్థితిలో ఉండే అబ్బాయికి ఉండదు

తేడా వచ్చేది ఇక్కడే...
(సశేషం)

ఇది ఇప్పటి పరిస్థితులను దగ్గరగా చూడడం వల్ల చేసిన విశ్లేషణ తప్ప, పురుషుడు గొప్పవాడనో, లేక స్త్రీలు గొప్పవారనో చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం కాదు. ఏవో కొన్ని సంఘటనలు చూసి స్త్రీలంతా అలాంటి వారే, పురుషులంతా ఇలాంటి వారే అని చెప్పడమూ వ్యాసాల ఉద్దేశ్యమూ కాదు. ఎంత సేపూ స్త్రీ స్వాతంత్ర్యం , పురుష దురహంకారం లాంటి విషయాలే కాదు.. ఇలాంటివి కూడా ప్రపంచంలో జరుగుతున్నాయి. చాప కింద నీటిలా విష సంస్కృతి మన జీవితాల్లోకి, మన కుటుంబాల్లోకి విస్తరిస్తోందనే అవగాహన కలిగితే, దాన్ని ఎలా నివారించాలి అనే ఆలోచన కలిగితే నా ప్రయత్నం సఫలమైనట్టే..

1 comment:

Anonymous said...

well said.
you are 100% right