Tuesday, June 30, 2009

అంతర్మధనం

“విజయమా విజయమా … వస్తూ వస్తూ ఆకాశానికి ఎందుకు తీసుకెళతావ్?
వెళ్తూ వెళ్తూ పాతాళానికి ఎందుకు తోస్తావ్?”

ఇది యండమూరి గారి “వెన్నెల్లో ఆడపిల్ల” నవల్లో ఒక చక్కటి వాక్యం..
ఏ కాలానికైనా … ఈ వాక్యపు అర్థం లో మార్పు ఉండదేమో..!

మనిషికి ఉన్న అనేకానేక వ్యసనాల్లో, కీర్తి కాంక్ష ఒకటి. ఈ కీర్తి కాంక్ష మనిషి జీవితాన్ని ఎంతలా నాశనం చేస్తుందో చెప్పడానికి ఉదహరణే, మైకేల్ జాక్సన్ జీవితం! పాప్ సంగీత ప్రపంచం లో రారాజు గా వెలుగొందిన ఈ మనిషి జీవితం అంతా సమస్యల వలయం! ఎన్నెన్ని విజయ శిఖరాలు అధిరోహించాడో, అంత పాతాళపు లోతులూ చవి చూసిన గాయకుడతను. అనితరసాధ్యమైన కీర్తి ప్రఖ్యాతులూ, దానితోబాటే వచ్చి పడ్డ సంపద ఇవేవీ ఆయన జీవితాన్ని సుఖప్రదం చెయ్యలేక పోయాయి. “సన్ పత్రిక” ప్రచురించిన, ఆయన అటాప్సీ రిపోర్ట్ చూస్తే తడి అవ్వని నయనం ఉండదేమో..! కడుపులో లభించిన ఆహరం కేవలం మాత్రలే నట.. సి.పి.ఆర్ చేసినప్పుడు ఎముకలు విరిగాయి అంటే.. ఆయన శరీరం లో ఎముకలు ఎంత పెళుసుగా తయరయ్యాయో అర్థం ఔతుంది! ముఖమంతా ప్లాస్టిక్ సర్జరీ గాట్లు, జుట్టు అసలు లేక పోవడం.. ఇవన్నీ చూస్తే, ఇది మైకేల్ లాంటి వ్యక్తి కి రావల్సిన దుస్థితి కాదేమో అనిపిస్తుంది.

ఇలాంటి సందర్భాల్లో చాలా మందికి ఒక తాత్కాలిక వేదాంతం ఆవహించడం సాధారణమైన విషయం. ఆ వేదాంతం లోంచి పుట్టిందే ఈ వ్యాసం. వేదాంతం తాత్కాలికమేమో గానీ, ఆ వేదాంతం లోని సారాంశం మాత్రం శాశ్వతం..!

ఒక మనిషి తన జీవితం లో ఎన్నెన్నో చెయ్యాలనుకొంటాడు. కారణం.. సమాజం లో ఆ వ్యక్తి కి ప్రత్యేకమైన గుర్తింపో, లేక అధికారమో, లేక ధనదాహమో …ఏదో ఒకటి! కానీ వీటన్నిటి లో పడి ఆ మనిషి చాలా సుళువుగా ఒక విషయం మరచి పోతాడు… ఏంటో తెలుసా?

జీవించడం !

మనిషి జీవితం లో మధుర క్షణం వర్తమానమే! గతించిన దాన్ని మళ్ళీ తీసుకు రాలేననీ, భవిష్యత్తు తన అదుపులో లేదని తెలిసీ మనిషి పరుగులు తీస్తాడు..

వర్తమానాన్ని వదిలేస్తాడు. అబద్దాలు చెపుతాడు, మోసాలు చెస్తాడు, డబ్బు సంపాదిస్తాడు. కానీ అన్నీ సాధించి ఒక స్థానానికి వచ్చేసరికి ఆ మనిషికి జీవించడానికి జీవితమే ఉండదు!

ఎక్కడో చదివాను..

“మనుషులు బతుకంతా, బతకడానికి చస్తారు. చచ్చేప్పుడు అసలెప్పుడైనా బతికామా అనేలా చస్తారు”

ఇదీ ఆ స్టేట్మెంట్ ! ఎంత నిజం ఉందో కదా..
ఈ ప్రపంచం లో మనిషి ఆనందంగా జీవించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ అవేవీ ఆనంద సాధకాలు గా కనిపించక పోవడానికి కారణం.. డబ్బు, కీర్తి కాంక్ష, స్వార్థం !

వీటిలో ఏ ఒక్కటీ .. మనిషిని కుదురుగా నిలువనివ్వదు.. ! ఎంత డబ్బు సంపాదించినా.. ఎంత కీర్తిని సంపాదించినా అవన్నీ చాలా తాత్కాలికమేననీ, మరో వందేళ్ళ తరువాత మనలను అనుకోవడానికి మనుషులు ఉండరనీ చాలా సౌకర్యం గా మరచి పోతాం మనం..

కింది ప్రశ్నలకు సమాధానం చెప్పండి…

1.వందేళ్ళ కిందట అప్పటి సమాజాన్ని ఉర్రూతలూపిన గాయకుడు ఎవరు ( ఇప్పటి బాలు గారిలా)?
2)స్వాతంత్ర్య సమరం లో అసువులు బాసిన ఒక ప్రాంత ( మీ ప్రాంత) రాజకీయ నాయకుడెవరు?
3) వందేళ్ళ కిందట , ఒక దేశం లెవెల్ లో గానీ, ఒక రాష్ట్రం లెవెల్ లో గానీ, ఒక ప్రాంతం లెవెల్ లో గానీ అత్యధిక ధనవంతుడెవరు?
4)వందేళ్ళ క్రితం గొప్ప రచయిత ఎవరు… (ఏ భాషలో ఐనా..)?
5)వందేళ్ళ క్రితం గొప్ప విజ్ఞాన వేత్త ఎవరు?

ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం చెప్పలేక పోవచ్చు.. కొంచం ఆలోచిస్తే ఒకటి రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చేమో..!

కానీ.. ఆ వ్యక్తులను మనం దైనందిన జీవితం లో ఎలా తల్చుకొంటున్నాం.. ఎంత సేపు అనుకొంటున్నాం? ఒకరిద్దరిని అనుకొన్నా.. వారికి ఇప్పుడు ఉండే పేరు ప్రఖ్యాతులు ఎంత…వారు చేసిన పనులకు విలువ ఎంత?

ఒక రచయిత గురించి తల్చుకొన్నామనుకోండి. ఫలానా పద్యం ఫలానా ఆయన వ్రాయలేదని.. ఎక్కడి నుండో దొంగిలించాడనీ..ఇలా ఆ వ్యక్తి లో ఉన్న లోటు పాట్లు చూపే వాళ్ళే ఎక్కువ..!
గాంధీ గారి లాంటి నాయకుడిలో కూడా, ఈ రోజు వంకలు వెతికే జనం తయారయ్యారు మరి !

ఆ మనిషి తన జీవితం లో ఒక స్థాయికి రావడానికి ఎంత కృషి చేసి ఉంటాడు అనేది ఎంత మందికి గుర్తుంది..? నేను ఎవరినీ తప్పు పట్టడం లేదు..జస్ట్ వాస్తవం చూసే ప్రయత్నం చేస్తున్నా..!

ఇప్పుడు సినీ రంగంలో మెగా స్టార్ ఎవరూ అంటే.. ఠక్కున చిరంజీవి అంటారు.. మరో ఇరవై యేళ్ళకు.. ఆయన సినిమా చూసి నవ్వుకొనే వాళ్ళూ, విమర్శించే వాళ్ళూ బయలుదేరుతారు.. మరో వందేళ్ళ తర్వాత చిరంజీవి అని ఉండేవాడట అని ఎప్పుడో.. ఎవరో ఒకరు అనుకోవచ్చు.. మరో వందేళ్ళకు అలా అనుకొనే వాళ్ళే ఉండరు..!

నా ఉద్దేశ్యం.. ఇలా ఉంటుంది కాబట్టి మనిషి జస్ట్ తిని తొంగుంటే చాలు అని కాదు.. ఖచ్చితంగా మనిషి తన ధర్మాన్ని తను చెయ్యాలి… తన అభిరుచుల్ని అమలు పరచాలి.. (లేక పోతే ఒక ఒక ఎడిసన్ ఉండే వాడు కాదు, ఒక షేక్స్పియర్ ఉండే వాడు కాదు, ఒక గురజాడ తెల్సే వాడు కాదు) కానీ తాత్కాలిక ఆవేశ కావేశాలకు లొంగి.. పగ సాధించడాలూ…, తనను ప్రేమించ లేదు కాబట్టీ చంపేయడాలూ ..డబ్బే సర్వం అనుకొనే వాళ్ళూ, బంధాలకన్నా ఈగోలే ఎక్కువ అనుకొనే వాళ్ళూ, బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళూ ఒక్క సారి మాత్రం పునరాలోచించుకోవాలి ! మనిషి అస్థిత్వానికి ఉన్న విలువ చాలా తక్కువ.. ! ఆ అస్థిత్వాన్ని సార్థకం చేసుకొంటే మరణం కూడా మనోహరం అవుతుంది.. తన ధర్మం తను చేస్తూ.. జీవితాన్ని పరి పూర్ణం గా జీవించడం వెనుక జీవిత పరమార్థముంది. డబ్బులు కానీ, ఆకాశానికి ఎగసిన కీర్తి ప్రతిష్టలు కానీ ఏవీ మనిషి కి ఆనందమివ్వవు..అలా ఎవరైనా డబ్బు వల్లో, కీర్తి వల్లో సకల సౌఖ్యాలు అనుభవించారని చరిత్రా చెప్పలేదు. ఎందుకంటే వ్యసనాలెప్పుడూ, తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి కాబట్టి !

మనిషికి ఆనందాన్ని కలిగించేది.. మనశ్శాంతి మాత్రమే !

ఒక తెలుగు కవి అన్నట్టు

"యే సిరులెందుకు.. యే నిధులెందుకు.. యే సౌఖ్యము లెందుకు..? ఆత్మ శాంతి లేనిదే..!"

మధుర గాయకుడు మైకేల్ జాక్సన్ జీవితమే అందుకు ఉదాహరణ..
ఎన్ని కీర్తి శిఖరాలెక్కినా..
ఎంత మంది అభిమానులను సంపాదించినా..
ఎంత సంపద పోగేసినా..
దొరకని ఆ అత్మ శాంతి కొరకు చివరి వరకూ పోరాడుతూనే ఉన్నాడు.

ఆతని ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకొంటూ…

ఆ మహా గాయకుడికి భావోద్వేగపు వీడ్కోలు.. !

7 comments:

Anonymous said...

వరునుడు గారు,
మీ రచనా శైలి చాలా బాగుంది,సగటు మనిషి తన జీవిత పయనమంలో ఎమి కోల్పోతున్నాడో హ్రుద్యంగా చెప్పగలిగారు.
"ఎంతో చిన్నది గీవితం, ఇంకా చిన్నది మనిషికున్న గుర్తింపు" అని చక్కగా చిక్కని తెలుగులో చెప్పరు.మీ రచనలు ఇలానే చేస్తూ ఉండండి,పదిమందికి మీ రచన మేలుకొలుపు కావాలని
కోరుకుంటూ..

మీ
వీరభద్రుడు

జీడిపప్పు said...

చాలా చక్కని వ్యాసం వ్రాసారు వరుణుడు గారు. చాలా మంచి విషయాలను స్పృశించారు. మనిషికి అతి ముఖ్యమయినవి మూడు. అవి 1) డబ్బు 2) డబ్బు 3) డబ్బు. కాకపోతే ఈ మూడింటికంటే విలువయినది సంతోషం.

అన్నట్టు మీ బ్లాగు కూడలిలో కనిపించలేదు!

Varunudu said...

@వీరభద్రా
:)
@జీడిపప్పు
బ్లాగ్ కూడలి లో చేర్చాను. కానీ ఇంత దాకా నాకు కూడలి నుండి ఎలాంటి కన్ ఫర్మేషన్ రాలేదు. ఏం చెయ్యాలి?

Anonymous said...

వరుణుడు గారు , మీరు మీ బ్లాగు ని కూడలిలో చేర్చిన తరువాత , మీకు ఏమీ సమాధానం రాదు, మేరే కూడలిలో బ్లాగుల లిస్టులో వెతకండి, ఒక సారి లిస్టు అయిన తరువాత మీరు కధ రాసిన ప్రతి సారి మీ బ్లాగు లిస్టు ఔతుంది.

మీ
వీరభద్రుడు

Anonymous said...

మైఖేల్ జాక్సన్ ఫొటో చూస్తే ఒక మనిషి ఫొటో చూసినట్టు ఉండదు.
ఒక బొమ్మలాగో ఒక గ్రహాంతరవాసిలానో ఉంటుంది.

మీరు చెప్పిన మిగతా విషయాలు చాలా బాగున్నాయి.
వాటిని నేను కూడా నాబ్లాగులో "ఆరంభం" అన్న టపాలో స్పృశించాను.
చదివి మీ అభిప్రాయం చెప్పగలరు.

బొల్లోజు బాబా said...

ఇలా ఉంటుంది కాబట్టి మనిషి జస్ట్ తిని తొంగుంటే చాలు అని కాదు.. ఖచ్చితంగా మనిషి తన ధర్మాన్ని తను చెయ్యాలి… తన అభిరుచుల్ని అమలు పరచాలి..

కమల్ హాసన్ యాభై వసంతాల నటనా జీవితాన్ని పురస్కరించుకొని ఏదో చానెల్ లో వచ్చిన ప్రోగ్రామ్ చూసాకా పై వాక్యాల లానే అనిపించింది. చాలా బాగా చెప్పారు.

బొల్లోజు బాబా

Anonymous said...

mistake... MJ not just a singer. more than singer, he is a great dancer.