Thursday, July 25, 2013

ఇంటిదీపమై వెలిగే ఇంధనాలు ఇంతులూ - కొంప కొఱివిగా మారే కారణాలు కాంతలు - 1


మొన్న మధ్య మా ఊరికి ఒక గొప్పాయన వచ్చారు. తెలుగు సంస్కృతికి, తెలుగు జాతికీ ఎన్నెన్నో సేవలు చేసిన అలాంటి మహనీయుడు వేదిక మీద అలా ప్రసంగిస్తుంటే పాజిటివ్ ఎనర్జీ అలా శ్రోతల్లోకి ప్రవహించింది. ఆయన ఉపన్యాసం విన్నాక ఒక రెండు మూడు గంటలైనా ఆయన మాటల ప్రభావం శ్రోతల్లో ఉంటుందంటే ఆయనకు జీవితం పైన, జీవితంలోని లక్ష్యాల పైనా ఎంత ఖచ్చితమైన అవగాహన ఉందో అర్థమౌతుంది అని అనుకొన్నాను నేను. కేవలం అనుకొని వదిలేసి ఉంటే వ్యాసం పుట్టేది కాదేమో

నేను అనుకొన్న మాటే తర్వాత మా మిత్రునితో అన్నాను.

మిత్రుడు ఆయన సభకు హాజరవలేదు.

నేను చెప్పిందంతా వినిచాలా స్ఫూర్తి దాయకమైన వ్యక్తి.. కానీ…” అంటూ నీళ్ళు నమిలాడు..

ఏంటో చెప్పుఅన్నాను నేను..

“ … ఆయనకు కరెక్ట్ ఆఫీసర్ తగల్లేదు జీవితంలోతగిలింటే.. పాజిటివ్ దృక్పథాలు, సమాజ సేవలూ అన్నీ మానేసి బుధ్ధిగా ఇంట్లో ఉండే వాడు..” అన్నాడు  అతను.

నాకు అర్థం కాలేదు..

“ … కరెక్ట్ ఆఫీసర్ తగలక పోవడం ఏమిటి? ఆయన నిర్వహించిన కార్యక్రమమైనా, ఒక్కటి కూడా సామాన్యుడు కలలో కూడా ఊహించలేనిదిఎందరో అధికారుల్ని కలవాలి.. మంత్రి స్థాయి వారితో మాట్లాడాలి.. ఒక్కో సారి ముఖ్య మంత్రిని కూడా కలవాల్సి వస్తుందినిధుల సేకరణఇలాంటి విషయాలన్నిటికి అడుగు అడుగునా అడ్డంకులే  ఉండే దేశం మనది.. అలాంటిది ఆయన అనుకొన్న ఒక లక్ష్య సాధనకు.. రక రకాల అనుభవాలు రుచి చూపించిన ఆఫీసర్స్ తగిలారు ఆయనకు.. నువ్వు ఆయన మాటలు వినిఉంటే నీకే అర్థమయ్యేది.. ఆయన ఎంతగా శ్రమించాడో..” కాస్తా బాధగా అయినా సరేగట్టిగానే చెప్పాను నేను.

మా మిత్రుడు నవ్వి.. “ కరెక్ట్ ఆఫీసర్అంటే తప్పుగా అర్థం చేసుకొన్నావ్ నువ్వు.. కరెక్ట్ ఆఫీసర్ అంటే.. భార్య …!”  అన్నాడు.

ఒక్క క్షణం తర్వాత అర్థమయ్యింది నాకు. నవ్వేసాను..

తర్వాత ఆలోచిస్తే నిజమే అనిపించింది నాకు..

అసలు భార్య సహాయ సహకారాలు లేక పోతే చాలా గొప్ప వారిగా పేరుబడ్డ వాళ్ళ జీవితం మరోలా ఉండేదేమో..

దాదాపు 35 యేళ్ళ కిందట అనుకొంటా.. వేజేళ్ళ సత్యనారాయణ దర్శకత్వంలోఆడవాళ్ళే అలిగితేఅని ఒక సినిమా వచ్చింది.. నలుగురు అన్నదమ్ములు కలసి మెలసి కష్ట సుఖాల్ని పంచుకొంటూ ఆనందంగా ఉంటారు సినిమాలో.. అంతా తమ గొప్పదనం, సర్దుకు పోయే తత్వం వల్లనే అది సాధ్యం అనుకొంటూ ఉంటారు.. ఒక రోజు ఇంటి ఆడాళ్ళు వీళ్ళను చాలెంజ్ చేస్తారు.. ఇంట్లో తమ సహకారం లేక పోతే.. వాళ్ళు అలా కలసి ఉండలేరని.. దానికి నలుగురూ వ్యతిరేకిస్తారు. బ్రహ్మ రుద్రులు వచ్చినా తమను విడదీసే శక్తి వారికి లేదనీ, ఇంట్లో ఉండే ఆడాళ్ళు మీరేం చెయ్యగలరని బీరాలు పలుకుతారు. దాంతో ఇంట్లోని ఆడాళ్ళు అంతా ఒక పథకం ప్రకారం.. మగాళ్ళను పీడించడం మొదలెడతారు.. ఆరు నెలల్లోనే అన్నదమ్ములు విడిపోతారు.. తర్వాత విషయం తెలిసి భార్యల ప్రాధాన్యత గుర్తించి వాళ్ళకు తగిన గౌరవాన్ని ఇస్తారు.. ఇదీ కథ..

ఎప్పుడో 35 యేళ్ళ క్రితం సినిమా అయినా, ఈనాటికైనా కథలో చెప్పబడ్డ నీతి అనుసరణీయమే.
సదరు గొప్పవాళ్ళ సతీమణుల గురించి ఎవరూ ఆలోచించే వాళ్ళే ఉండరు. వాళ్ళ శ్రమ, త్యాగాల గురించి పట్టించుకొనే నాధుడే ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో..
".. ఆ ఏముందిలే, ఆవిడ ఏమైనా భూభారం మోసిందా... ఇంటిని చూసుకోవడం కూడా గొప్ప త్యాగమేనా .." అనుకొనే వాళ్ళు కోకొల్లలు. కానీ ఎంత గొప్పవ్యక్తికైనా,బాల్యంలో తల్లిదండ్రులూ, తర్వాత  తన జీవన సహచరి అండ లేకుండా, కీర్తి శిఖరాల్ని అధిరోహించడం చాలా కష్టం. ఐనా సరే, సన్మానాలూ,అభినందనలూ అందుకొనే వ్యక్తి మాత్రం జీవన సహచరి మాత్రం కాదు. మహా అంటే సభలో ఒక ముక్క ఆవిడ గురించి ఉటంకించొచ్చు గాక!

కాకపోతే.. ఇప్పటి జెనరేషన్ లో చాలా మార్పులు వచ్చాయిఅమ్మాయిలు పెద్ద చదువులు చదువుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం విపరీతంగా ఉంది, ముఖ్యంగా విదే శాలకు వెళ్ళే వారు ఎక్కువయ్యారు. స్త్రీ అనుకూల చట్టాలు అనేకం వచ్చాయి. ఒక  ముప్పై యేళ్ళ కిందటి పరిస్థితికీ ఇప్పటికీ సంబంధమే లేదు. స్త్రీకి స్వాతంత్ర్యం కావాలనీస్త్రీ కూడా అన్ని పనులు చెయ్యగలదనీ ఎందరో మహానుభావులు సాహిత్య పరంగా, సామాజికంగా చేసిన సేవలు ఒక ఎత్తైతేసమాజ పరి ణామ క్రమంలో భాగంగా వచ్చిన ప్రపంచీకరణ అసలు జీవనాల్లోని చాలా అర్థాల్ని మార్చేసింది.

ఇప్పుడు స్వాతంత్ర్యానికి ఉన్న అర్థం వేరు..   ఇప్పటి స్వాతంత్ర్యానికి హక్కులు కావాలి.. బాధ్యతలు వద్దు!

బాధ్యతా రహిత స్వాతంత్ర్యంఒక కుటుంబానికైనా, ఒక దేశానికైనా అనర్థదాయకం అన్నది నిష్ఠుర సత్యం.. !  ఇప్పుడు స్వాతంత్ర్యం ముసుగులో జరుగుతున్న ఎక్స్ప్లాయిటేషన్, హైందవ కుటుంబ వ్యవస్థ ఉనికినే  ప్రశ్నార్థకం చేసింది. రోజు పెళ్ళి, రెండేళ్ళలో విడాకులూమళ్ళీ పెళ్ళిళ్ళు.. ఇలా ఉంది.. దీని వల్ల నష్ట పోతోంది ఎవరు..? భార్యా? భర్తా? కుటుంబమా? కావచ్చేమో.. కానీ అంత కన్న భయంకర నష్టం భావి తరాలకు జరుగుతోంది.. విడిపోయే దంపతులకు పిల్లలు ఉంటే.. పిల్లల భవిష్యత్తు, వారి మానసిక వికాసం తీవ్రమైన అలజడులకు గురవుతోంది..

ఇప్పటి సమాజ పరిస్థితుల్లో ప్రబలుతున్న జాడ్యం గురించి విశ్లేషణ..!

 

ఇది ఇప్పటి పరిస్థితులను దగ్గరగా చూడడం వల్ల చేసిన విశ్లేషణ తప్ప, పురుషుడు గొప్పవాడనో, లేక స్త్రీలు గొప్పవారనో చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం కాదు. ఏవో కొన్ని సంఘటనలు చూసి స్త్రీలంతా అలాంటి వారే, పురుషులంతా ఇలాంటి వారే అని చెప్పడమూ వ్యాసాల ఉద్దేశ్యమూ కాదు.  ఎంత సేపూ స్త్రీ స్వాతంత్ర్యం , పురుష దురహంకారం లాంటి విషయాలే కాదు.. ఇలాంటివి కూడా ప్రపంచంలో జరుగుతున్నాయి. చాప కింద నీటిలా విష సంస్కృతి మన జీవితాల్లోకి, మన కుటుంబాల్లోకి విస్తరిస్తోందనే అవగాహన కలిగితే, దాన్ని ఎలా నివారించాలి అనే ఆలోచన కలిగితే నా ప్రయత్నం సఫలమైనట్టే..

 

(సశేషం)

No comments: